- పన్నులు, పాలనలో పారదర్శకత కోసమే
- అన్ని శాఖల సమన్వయమే లక్ష్యంగా కొత్త యాక్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో కొత్త చట్టం రానున్నది. ఇదివరకు ఉన్న జీహెచ్ఎంసీ చట్టంలో పలు మార్పులు చేసి కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ ముసాయిదాను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.
ఈ కొత్త చట్టం ద్వారా మూడు కార్పొరేషన్లతో పాటు హెచ్‌ఎండీఏ, హైడ్రా, జలమండలి, విద్యుత్, పోలీసు వంటి కీలక విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యం. దీనివల్ల భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్ను విధింపు, అడ్వర్టైజ్మెంట్ పాలసీ వంటి పౌర సేవలన్నీ మూడు కార్పొరేషన్ల పరిధిలో ఒకే నిబంధనలతో, పారదర్శకంగా అమలు కానున్నాయి.
బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదం
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ కొత్త చట్టం బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ఆమోదం పొందిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి, ట్రై-కార్పొరేషన్ల పరిధిలో దీనిని అమలు చేయనున్నారు. దీనివల్ల అధికారుల మధ్య సమన్వయం పెరగడంతో పాటు ప్రజలకు సేవలు పొందడంలో ఎక్కడా గందరగోళం ఉండదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘క్యూర్’ పరిధిలో ఈ చట్టపరమైన మార్పులు అత్యంత కీలకం కానున్నాయి.
ఈ చట్టం రావడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్ల ఆదాయ మార్గాలు మెరుగుపడతాయని, అక్రమాలకు తావులేకుండా పారదర్శకత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది వరకు లోకల్ బాడీలుగా ఉన్న మున్సిపాలిటీల్లో ఒక రకమైన ప్రాపర్టీ ట్యాక్స్ లు, పాత జీహెచ్ఎంసీ పరిధిలో మరో రకమైన ప్రపార్టీ ట్యాక్స్ లు ఉన్నాయి. కొత్త యాక్ట్ అందుబాటులోకి వస్తే అంతటా ఒకే రమైన పన్నుల ఉండనున్నాయి.
వచ్చే నెల నుంచే అమలు..?
వచ్చే నెల కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే కొత్త చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు కార్పొరేషన్లకి జీహెచ్ఎంసీనే పెద్దన్న పాత్ర పోషిస్తుంది. వచ్చే నెల నుంచి అన్ని విభాగాలకి సంబంధించి మూడు కార్పొరేషనర్లు పూర్తిగా సపరేట్ పాలనను మొదటుపెట్టనున్నాయి. అయితే, అప్పటి నుంచే కొత్త చట్టాన్ని అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో గ్రీన్ సిగ్నల్ లభించడమే ఆలస్యంగా ఉంది.
